కీళ్లనొప్పులకు ఆయుర్వేదమే కరెక్ట్ వైద్యం
కీళ్లనొప్పులకు ఆయుర్వేదమే కరెక్ట్ వైద్యం |
ఆయుర్వేదం ప్రకారం కీళ్లనొప్పులు ఎన్ని రకాలు?
ఆయుర్వేదం ప్రకారం కీళ్లనొప్పులు 3 రకాలు. వీటిలో సంధులలో వాత ప్రకోపంవల్ల వచ్చే సంధి వాతం మొదటిది. ఈ సమస్య 50- 60 ఏళ్ళ వయసువారిలో ఎక్కువగా కనిపిస్తుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీన్నే ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. కీళ్లనొప్పి, వాపు, కదిలినపుడు కీళ్లలో శబ్దం రావటం, విశ్రాంతి తీసుకుంటే నొప్పి తగ్గడం దీని ప్రధాన లక్షణాలు. పోషకాహారలోపంతో బాటు మధుమేహం, స్థూలకాయం, సొరియాసిస్ వంటి సమస్యలు, ద్విచక్రవాహనాలపై ప్రయాణించడం, అధిక బరువులు మోయడం, కంప్యూటర్స్ ముందు గంటల తరబడి కూర్చుని పని చేయడం వంటివి ఈ సమస్యకు ప్రధాన కారణాలు .
రెండవది ఆమవాతం.( రుమటాయిడ్ ఆర్థరైటిస్). ఆమ, వాత దోషాలు ఈ సమస్యకు కారణాలు. ఈ వ్యాధి అన్ని కీళ్లలో వస్తుంది. అధిక ఒత్తిడి, అతి ఆలోచన, కోపం, విచారం, ఆహార నియమాలు పాటించకపోవడం, వ్యాయామలేమి, జీర్ణవ్యవస్థ పనితీరు తగ్గటం దీనికి ప్రధాన కారణాలు. దీని బాధితుల్లో వాపు, నొప్పి, జ్వరం, కీళ్లు బిగుసుకుపోవడం, ఆకలి మందగించడం, మలబద్ధకం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
మూడవది వాత రక్తం.( గౌట్). నడివయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మితిమీరిన మద్యపానం, మాంసం, పులుపు, ఉప్పు, మసాలా, నిలువ ఉంచిన, రెడీమేడ్ ఆహారం తీసుకోవడం, శారీరకశ్రమ లేకపోవడం, ద్విచక్రవాహన ప్రయాణం, ఎక్కువ దూరం నడవడం వల్ల ఈ సమస్య రావచ్చు. బాధితుల్లో రక్తంలో యూరిక్ ఆమ్లం స్థాయిలు పెరుగుతాయి. కాలి బొటన వేలి వాపు, నొప్పితో ప్రారంభమైన సమస్య మిగిలిన కీళ్లకూ వ్యాపిస్తుంది. కీళ్లనొప్పులతో పాటు చర్మం రంగు కూడా మారుతుంది.
ఆయుర్వేద పరిష్కారాలు
పై సమస్యలకు మేలైన ఆయుర్వేద చికిత్సలు చక్కగా పనిచేస్తాయి. వీటిలో మొదటిది నిదాన పరివర్జనం. ఇందులో వ్యాధి కారకాలను గుర్తించి వాటికి దూరంగా ఉండేలా చూస్తారు. అంటే.. పగలు నిద్రపోవడం, రాత్రి మేల్కొని ఉండటం వంటి అలవాట్లు మార్చుకోవటం, వేళకి తినటం, పోషకాహారం తీసుకోవడం, తగిన వ్యాయామం చేయడం, తగిన విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఇక.. రెండవ పరిష్కారం ఔషధ సేవనం. ఇందులో శమనము (వ్యాధి దోషాలను బట్టి ఔషధాలు వాడటం) , శోధనము (పంచకర్మ చికిత్స) అని రెండు రకాలు. ఇవిగాక అభ్యంగ, శిరోధార, కటివస్తి, గ్రీవవస్తి, జానువస్తి వంటి బాహ్యచికిత్సలు కూడా అవసరాన్ని బట్టి తీసుకోవాల్సి రావచ్చు.
No comments:
Post a Comment