అనారోగ్య సమస్యలకు చేతుల అపరిశుభ్రతే ప్రధాన కారణం!
అనారోగ్య సమస్యలకు చేతుల అపరిశుభ్రతే ప్రధాన కారణం! |
చేతులే క్రిముల ఆవాసాలు
రోజువారీ దినచర్య ఏదైనా చేతుల సాయం ఉండాల్సిందే. తినటం, రాయటం, బరువులెత్తటం, ఇల్లు శుభ్రం చేయటం ఇలా ప్రతి పనిలోనూ చేతుల భాగస్వామ్యం ఉంటుంది. ఈ క్రమంలో ఆ పనిని బట్టి మలినాలు, సూక్ష్మ క్రిములు చేతికి అంటుకోవటం, అవే చేతులతో ఆహారం తీసుకోవటం, నీళ్లు తాగటం, ముక్కు, ముఖం తుడుచుకోవటం వల్ల శరీరంలోకి చేరతాయి. మల విసర్జన తరువాత చేతులను సబ్బుతో గాక కేవలం నీటితో కడిగి సరిపెట్టేవారిలో ఈ ముప్పు మరింత ఎక్కువ.
చేతుల శుభ్రం ఎప్పుడు?
పిల్లల మొదలు పెద్దల వరకు మల విసర్జన చేసిన ప్రతిసారీ సబ్బుతో చేతులు కడుక్కోవాలి. అలాగే చంటి బిడ్డలకు అన్నం తినిపించేవారు సైతం దీన్ని విధిగా పాటించాలి. వ్యాయామం, ఆటపాటలు, శారీరక శ్రమతో అలసిపోయిన వారు ఇంటికి రాగానే ముందు చేతులు కడుక్కొని ఏదైనా తినాలి.
ఎలా?
ముందుగా నీటితో చేతులు తడుపుకొని డెట్టాల్ ద్రావణం లేదా సబ్బు పూసుకోవాలి. ముందుగా ఒక అరచేతిని మరో అర చేతితో రుద్ది, చేతి వేళ్ళను వేరే చేతి వేళ్ళతో రుద్దాలి. తర్వాత వేళ్ళ కొనలతో అరచేతిని, ఆ తరువాత చేతి వెనక మణికట్టు వరకు రుద్దాలి. చివరగా కుడి అరచేతిలో ఎడమ చేతిని పెట్టి గుండ్రంగా తిప్పుతూ రుద్దాలి. అలాగే రెండో చేతినీ చేయాలి. ఇలా 5 సార్లు చేసి తగినంత నీటితో సబ్బు నురుగు పూర్తిగా పోయేలా శుభ్రం చేసుకొని పొడి బట్టతో తుడుచుకోవాలి.
ఇతర అంశాలు
రోజులో రెండు మూడు సార్లైనా రెండు చుక్కల శానిటైజర్ అరచేతిలో వేసుకొని రుద్ది చేతులను ఆరబెట్టుకోవాలి. సున్నిపిండి, పసుపు, వేడినీళ్ళూ కూడా శానిటైజర్ గా వాడుకోవచ్చు.
ఎక్కువ రసాయనాలున్న సబ్బుతో చేతులు కడిగితే చేతుల చర్మం పొడిబారుతుంది కనుక సహజ నూనెలున్న సబ్బు వాడటం మంచిది.
పిల్లలు మట్టిలో ఆడుకొని రాగానే స్నానం చేయటం లేదా సబ్బుతో చేతులు కడగటం అలవరచాలి.
సింక్ లోపలి వైపు చేతులు తగలకుండా చూడాలి. అందులో పడిన పదార్థాలను కడిగి తినటం మానుకోవాలి.
పెరిగిన గోళ్ళు క్రిములకు సురక్షిత ఆవాసాలు గనుక ఎప్పటికప్పుడు వాటిని కత్తిరించుకోవాలి.గోళ్లు కొరకడం మానుకోవాలి.
No comments:
Post a Comment