Sunday, July 26, 2020

What can be done to reduce the risk of stroke? | పక్షవాతం ముప్పు తగ్గాలంటే ఏమి చేయాలి?

పక్షవాతం ముప్పు తగ్గాలంటే ఏమి చేయాలి?

What can be done to reduce the risk of stroke
పక్షవాతం ముప్పు తగ్గాలంటే ఏమి చేయాలి?
మన శరీరంలో మెదడు అత్యంత కీలకమైన అవయవం. మిగిలిన అవయవాలకు జరిగినట్లే మెదడుకూ నిరంతరం రక్తప్రసరణ జరుగుతూ ఉంటుంది. అయితే  ఒక్కోసారి మెదడుకు రక్తాన్ని, పోషక పదార్థాలను సరఫరా చేసే రక్తనాళాలు హఠాత్తుగా మూసుకుపోతాయి. వైద్యపరిభాషలో దీన్నే 'స్ట్రోక్' అంటారు. సాధారణ పరిభాషలో దీనినే పక్షవాతం అనీ అంటారు. దీనివల్ల మెదడులోని ఆ భాగంలోని కణాలకు ప్రాణవాయువు అందక పోవటంతో అవి దెబ్బతినటం లేదా చనిపోవటం జరుగుతుంది. ఇలాంటి స్థితిలో తక్షణ వైద్యం అందకపోతే మరణం సైతం సంభవించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మొత్తం మరణాల్లో  మూడవ ప్రధాన కారణం ఇదే. మనదేశంలో యేటా 17 లక్షల మంది దీనిబారిన పడుతుండగా వీరిలో మహిళల కంటే పురుషుల సంఖ్యే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య పట్ల అవగాహన పెంచేందుకు ఏటా అక్టోబర్ 29 న 'వరల్డ్ స్ట్రోక్ డే' పేరిట పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.



కారణాలు

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగావటం, మితిమీరిన రక్తపోటు, ధూమపానం, మద్యపానం, బానపొట్ట, గుండె పనితీరు మందగించటం అతిగా ఉప్పు తినటం, ఒంటికి చెమటపట్టని జీవన శైలి, డ్రగ్స్ వినియోగం, గర్భనిరోక మాత్రల వినియోగం, డీహైడ్రేషన్‌  వంటివి పక్షవాతానికి ప్రధాన కారణాలు. ఇవిగాక వృద్ధాప్య ప్రభావం, జన్యుపరమైన అంశాలు, కూడా పక్షవాతానికి దారి తీయవచ్చు.

గుర్తించటం ఎలా..?

   హఠాత్తుగా కొన్ని క్షణాలపాటు శరీరపు కుడి లేదా ఎడమవైపు భాగమంతా మొద్దుబారటం లేదా బలహీనమైన భావన, మాట తడబడటం, గందరగోళంగా అనిపించటం, ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోలేకపోవటం, కన్ను లేదా కళ్ళు బైర్లు గమ్మటం, నడక తడబాటు, కళ్ళు తిరిగినట్లు అనిపించటం, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని పక్షవాతపు సూచనగా అనుమానించి తక్షణం వైద్యులను సంప్రదించాలి. ఇలాంటి సందర్భాల్లో మెదడు కుడిభాగంలో రక్తం గడ్డకడితే శరీర ఎడమ వైపు అవయవాలు, ఎడమ భాగాన రక్త సరఫరా ఆగితే కుడివైపు అవయవాల పనితీరులో మార్పులొస్తాయి. మూతి వంకర అవడం, మాట పడిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. పదే పదే పక్షవాతం వస్తే అంగవైకల్యంతో బాటు జ్ఞాపకశక్తి తగ్గిపోవటం, నిర్ణయాలు తీసుకోలేని స్థితి, దేన్నీ అర్థం చేసుకోలేక పోవటం వంటి ఇబ్బందులూ రావచ్చు.

ఎన్ని రకాలు?

ఇది ముఖ్యంగా 4 రకాలు. అధిక రక్తపోటు వల్ల రక్త నాళాలు చిట్లి రక్తం గడ్డకట్టటంతో ఆ భాగంలో నాడీకణాల పనితీరు దెబ్బతినటాన్ని 'హెమరేజిక్ స్ట్రోక్' అంటారు. గడ్డ కట్టిన రక్తం పరిమాణం, తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. చిన్న చిన్న రక్తం గడ్డలైతే మందులతో, పెద్దవైతే సర్జరీ చేయాల్సి వస్తుంది. రెండవది ఇస్కీమిక్ స్ట్రోక్. ఇది మెదడు రక్తనాళాల్లో పూడిక ఏర్పడి రక్త సరఫరా ఆగిపోవటం వల్ల వస్తుంది. ఈ కేసుల్లో తగిన వైడెమా అందకపోతే 4-6 గంటల్లో మెదడు క్రమేపీ చచ్చుపడిపోతుంది. ఈ లోపు పూడికను తొలగించే ఆర్‌టీపీఏ (రీకాంబినెంట్ టిష్యూ ప్లాస్‌మినోజెన్ యాక్టివేటర్) ఇంజెక్షన్ ఇవ్వగలిగితే అంగవైకల్యం రాకుండా చూసుకోవచ్చు. కొన్ని క్షణాలపాటు మెదడుకు రక్తం ఆగిపోవటం వల్ల వచ్చే దాన్ని ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అంటారు.స్పష్టమైన కారణాలు లేకుండా వచ్చే పక్షవాతాన్ని 'క్రిప్టోజెనిక్ అటాక్' అంటారు.

నివారణ

ఈ సమస్య పట్ల అవగాహన కలివుంటే దీన్ని 90 శాతం కేసుల్లో నివారించవచ్చు. జంక్‌ఫుడ్ మానుకోవటం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం, కాలుష్య రహిత ప్రాంతంలో నివాసముండటం, రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయాల వినియోగం పెంచుకోవటం , ధూమపానం, మద్యపానం మానుకోవటం, రోజూ కనీసం అరగంటైనా వ్యాయామం చేయటం వంటి  జాగ్రత్తలు పాటిస్తే 90శాతం పక్షవాతం ముప్పు తగ్గినట్లే.

తక్షణ చికిత్సే మార్గం

పక్షవాతం లక్షణాలు కనిపించగానే వీలున్నంత త్వరగా న్యూరాలజిస్ట్ సలహా తీసుకోవాలి. పక్షవాతం లక్షణాలు కనబడిన 3 గంటలలోపు ‘టీపీఏ’ చికిత్స అందిస్తే త్వరగా కోలుకొంటారు. లక్షణాలు కనిపించిన 4 గంటల తర్వాత ఆసుపత్రికి వస్తే- సీటీ స్కాన్‌ చేసి అవసరాన్ని బట్టి యాంజియోగ్రామ్‌ చేస్తారు. దీంతో మెదడులో మళ్లీ రక్తసరఫరా ఆరంభమవుతుంది. ఒకవేళ మెదడులో రక్తనాళం చిట్లితే ఆ రక్తనాళాన్ని మూసి తిరిగి రక్తసరఫరా పునరుద్ధరించేందుకు సర్జరీ చేయాల్సిరావచ్చు. అనంతరం రోగికి ఫిజియోథెరపీ ఇవ్వడంతో పాటు ఆవసరమైన ఎక్సర్‌సైజులు, మందులను అందించడంతో రోగి త్వరగానే కోలుకునే అవకాశం ఉంది.

No comments:

Post a Comment